శాఖల మధ్య సమన్వయంతో పని చేయడం ముఖ్యం
- మంత్రి కందుల దుర్గేష్
- ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి

కలెక్టరేట్‌లోని పీజీ ఆర్ ఎస్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు – 2027 ఏర్పాట్ల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్న విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించబడింది. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని శాఖల నుంచీ పూర్తి స్థాయి హేతుబద్ధ నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఈ సందర్భంగా వెల్లడించారు.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలు – 2027 కోసం ముందస్తు ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర సమీక్ష జరిపామని తెలిపారు. ఈ సమావేశం రాబోయే పుష్కరాలకు ఒక శుభారంభం అని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా పుష్కరాలకు భారీ స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ఇప్పటికే అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలతో ముందుకొచ్చారని వివరించారు. పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించిందని, కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు.
ఈసారి పుష్కరాలు గతం కన్నా మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నందున ఎలాంటి పొరపాటుకు అవకాశం లేకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా, మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు.
అలాగే ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టును పుష్కరాల నాటికి పూర్తి చేసి, భక్తులకు పర్యాటక అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రజా ప్రతినిధుల నుంచి సంబంధిత ప్రాంతాల పనుల వివరాలు సేకరించి, అన్ని ప్రతిపాదనల్లో చేర్చాలని కూడా మంత్రి సూచించారు. పుష్కరాలు నేపథ్యంలో రద్దీని సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెయ్యాలని, స్పెషల్ ట్రైన్స్ ఆగేలా చూడాలని రైల్వే అధికారులు సూచన చేశారు. ఈ అంశంపై ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ అందుకు అనుసరించి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలనీ ఆదేశించారు.
ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నేపథ్యంలో శాఖలవారీగా ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించినట్టు తెలిపారు. 2015 పుష్కరాలకు దాదాపు 5 కోట్ల మంది భక్తులు హాజరుకాగా, ఈసారి 7–8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రవాణా సదుపాయాలు, భోజనం, త్రాగునీరు, శానిటేషన్, భద్రత వంటి అంశాలలో ముందుగానే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
శాఖల వారీగా అంచనా నివేదికలు సిద్ధమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించి, అవసరమైన నిధులు పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, ఘాట్ల అభివృద్ధి, రద్దీ నిర్వహణ, తాత్కాలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, 2015 పుష్కరాల నివేదికలను సమీక్షించి వాటి ఆధారంగా 2027 పుష్కరాలకు అవసరమైన ప్రతిపాదనలను హేతుబద్ధంగా సిద్ధం చేయాలని అన్ని శాఖలను ఆదేశించమని, అందుకు అనుసరించి ఆయా శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
విభాగాల వారీగా ప్రతిపాదనలు, అంచనా ఖర్చులు, ఫేజ్–1 / ఫేజ్–2 అమలు ప్రణాళికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ పార్కింగ్ వ్యవస్థ ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు సూచనలు అనుసరించి ఘాట్‌ల అభివృద్ధి, మురుగునీటి పారుదల, శానిటేషన్ సిబ్బంది బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, 2015 పుష్కరాల్లో చేపట్టిన చర్యలు, ఈసారి చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఘాట్ మార్గాల విస్తరణ, రద్దీ అంచనాలు, నీటి నాణ్యత, తాత్కాలిక పార్కింగ్, శానిటేషన్, మోబైల్ కమాండ్ కంట్రోల్ యూనిట్లు మొదలైన అంశాలను వివరించారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీల సూచనలు :
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు – కొవ్వూరు స్టేషన్‌లో ప్రధాన రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – రియల్‌టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అమలు చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి – ఆంధ్రా షుగర్, ఏపీ పేపర్ మిల్స్ కాలుష్య నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలని చెప్పారు.
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ – ఘాట్‌లు, రహదారులు, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు – శానిటేషన్ సిబ్బందికి గౌరవభత్యం ఇవ్వాలని, మురుగునీటి పారుదల వ్యవస్థను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. నిధులు కేటాయింపు పై 2026- 27 రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో తగిన నిధులు ప్రతిపాదన కు మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా చొరవ చూపాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖరం – ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టవలసిన పనులను సమగ్ర ప్రతిపాదనల్లో చేర్చాలని కోరారు.
అనంతరం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ…
పుష్కరాల ఏర్పాట్లను అత్యంత ఉన్నత స్థాయిలో నిర్వహించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు. అధికారులకు రోడ్డు రవాణా, రైలు సేవలు, పారిశుద్ధ్యం, నీటి నాణ్యత, రద్దీ నియంత్రణ, పర్యాటక సదుపాయాల , రవాణా సదుపాయాలు, దేవాలయాలు అభివృద్ధి, మౌలిక వసతులు కల్పన, వంటి అంశాల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తగిన నిధులు విడుదల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలియ చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, డి ఆర్వో టి సీతారామ మూర్తి, అదనపు ఎస్పీ మురళీ కృష్ణ, ఆర్డీవో లు రాణి సుస్మిత, ఆర్ కృష్ణ నాయక్, జిల్లా అధికారులు కె గోపినాథ్, ఎస్బివి రెడ్డి, వి శాంతామణి, కె బాలకృష్ణ, టి తిలక్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


