- త్వరలో గోదావరి పరివాహాక ప్రాంతాలకు కొత్త సొబగులు
- రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు
- త్వరితగతిన అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తికి చర్యలు.. తద్వారా 8వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి..2035నాటికి 35 లక్షల పర్యాటకులు రావడమే లక్ష్యంగా ప్రాజెక్టు ఉండనుందన్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్
- సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలో టూరిజంల ప్రాజెక్టులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్ లు కృషి చేస్తున్నారన్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
- ఏపీకి దాదాపు రూ.450 కోట్లతో 7 టూరిజం ప్రాజెక్టులు మంజూరు .. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఏపీలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- అఖండ గోదావరి ప్రాజెక్టుతో అధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రాజధాని రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాలకు మరింత శోభ తెస్తామన్న మంత్రి కందుల దుర్గేష్
- రాష్ట్రాన్ని విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించే దిశ లో కూటమి ప్రభుత్వం టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు
- వికసిత్ రాజమహేంద్రవరంలో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్టు..2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి చేసి రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పురందేశ్వరీ హామీ
- అఖండ గోదావరి ప్రాజెక్టు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ప్రశంసించిన వక్తలు*
రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.తొలుత సభావేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు సందర్శించారు. అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు. 2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి అయి పర్యాటకులకు అందుబాటులోకి రానుందన్నారు.తద్వారా స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టు కు శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరీలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. చారిత్రాక నగరి అయిన రాజమండ్రిలో కొలువై ఉన్న పుష్కర్ ఘాట్ ను అధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం, ఎంపీ పురందేశ్వరీ, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ల చొరవతో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి దాదాపు రూ.450 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామన్నారు. స్వదేశీ దర్శన్, ప్రసాద్, శాస్కి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్(సీబీడీడీ) తదితర స్కీమ్ ల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం దోహదం చేస్తుందని, తద్వారా భారతదేశాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏపీలో స్వదేశీ దర్శన్ స్కీమ్ ద్వారా 2015-17లో కాకినాడ హోప్ ఐల్యాండ్,కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పులికాట్ సరస్సు, మైపాడు బీచ్, ఇసుకపల్లి లో సర్య్కూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్ లో భాగంగా శాలిహుండం, బావికొండ,అమరావతికి సహకారం అందించామని పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా అరకు, బొర్రా గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్ లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పర్యాటకులకు సాహస పర్యాటక అనుభవాలను అందిస్తున్నామన్నారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా అధ్యాత్మిక టూరిజానికి బాటలు వేస్తున్నామన్నారు..అమరావతి, శ్రీశైలం దేవాలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, సింహాచలం వరాహ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాన్నారు. ఆ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్యని పేర్కొన్నారు. అన్నవరం దేవాలయంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.శాస్కి (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ ) స్కీమ్ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధికి దాదాపు రూ.95 కోట్ల నిధులు కేటాయించామని, తద్వారా పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు, హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్ ల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. హేవలాక్ బ్రిడ్జిని మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్ది, దాదాపు 1.2 కి.మీల పొడవునా ఉన్న స్పాన్ లలో థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు . అంతేగాక రాజమండ్రి, ఏపీ చరిత్రను తెలుపుతామన్నారు. 120 ఎకరాల్లో బ్రిడ్జిలంకను వృద్ధి చేస్తామని, బోటింగ్ తో పాటు టెంట్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నిత్యహారతిలో భాగంగా గోదావరి హారతి ఘాట్ ను అధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు. కడియం నర్సరీలను ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కడియపులంకను అభివృద్ధి చేస్తామని, క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి కాలువలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తొలుత ఏటా 10-15 లక్షల మంది పర్యాటకులు సందర్శించేలా అఖండ గోదావరి ప్రాజెక్టును తీర్చిదిద్దబోతున్నామన్నారు. 2035నాటికి 35 లక్షల మంది పర్యాటకుల లక్ష్యంగా చర్యలు తీసుకుంటామన్నారు.అఖండ గోదావరి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి దేశంలోనే ప్రఖ్యాత స్పాట్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇవేగాక పుట్టపర్తి, అరకులలో లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పాటు వైజాగ్ పోర్టులో క్రూయిజ్ అండ్ కార్గో టర్మినల్, తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు.పర్యాటక, అతిథ్య రంగాలు సుస్థిర అభివృద్ధి చెందాలన్నదే తమ ధ్యేయమన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా అవకాశాలు, వనరులున్నాయని,తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా వస్తాయని తెలిపారు.ఏపీలో బుద్ధిస్ట్ సర్క్యూట్, కోస్టల్ లో ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామని, పీపీపీ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పలువురి అభ్యర్థనల మేరకు రాజమండ్రి నగరాన్ని వారసత్వ సాంస్కృతిక రాజధాని గా గుర్తింపు కు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో,ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, 2023లో టూరిజం రంగం దేశ ఎకానమీకి 10 శాతం ఆదాయం అందించిందని వివరించారు.అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణలో భారతదేశం మెరుగైన స్థానం సంపాదించాలని భావిస్తున్నామని, ఇప్పటికే ఆదిశగా అడుగులు వేశామన్నారు..దేశంలో పర్యాటకుల సందర్శన క్రమక్రమంగా పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల శాతం వేగంగా పెరిగింది భారతదేశంలో మాత్రమేనని స్పష్టం చేశారు. తాము చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రపంచ ఆర్థిక టూరిజం అండ్ ట్రావెల్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో 54వ స్థానంలో ఉన్న ఇండియా 39వ స్థానానికి చేరుకుందని, టాప్ 10 దేశాల్లో ఒకటిగా నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో 3 ట్రిలియన్స్ డాలర్ల ఎకానమీ అభివృద్ధి జరగాలి..టూరిజం రంగం ద్వారా 10 శాతం జాతీయ జీడీపీకి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ గా విరాజిల్లుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం చేసినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రజానీకాన్ని అభినందిస్తున్నానని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరమన్నారు. తీరం వెంబడి నాగరికత, నాగరికత ఉన్న చోట భాష వృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. అలాంటి ఈ నేల ఆంధ్రుల అన్నపూర్ణగా పేర్గాంచిన డొక్కా సీతమకు, మహాభారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయకు, ఎంతో మంది కళాకారులకు,సామాజిక వేత్తలకు,బాపు-రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ తదితర ఎందరో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిందని తెలిపారు. హేవలాక్ బ్రిడ్జి చాలా పురాతనమైందని, చాన్నాళ్లుగా నిరుపయోగంగా ఉందని, దీన్ని బాగుచేసుకొని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలన్నది చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్ష, కల అని తెలుపుతూ ఈ కలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. దాదాపు రూ.450 కోట్లతో 7 టూరిజం ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తున్నామన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని 2024 ఎన్నికల సమయంలో ఎన్డీయే సర్కార్ నిర్ణయించిందని, అందులో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్టు అని తెలిపారు. పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వందల సంఖ్యలో ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం కాదు..శక్తివంతమైన ప్రభుత్వం అని అర్థం చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో శక్తివంతమైన ప్రభుత్వాలు ఉండటం వల్ల ప్రాజెక్టులు సులువుగా వస్తాయని, త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందందన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మొదటి నుండి ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటంలో, నాపోలవరం ప్రాజెక్టు విషయంలో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడారని స్పష్టం గుర్తుచేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి 974 కి.మీల సుదీర్ఘ సముద్రతీరం, గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, ఇంకా ఎన్నో చిన్న నదులు ఉన్నాయని తెలుపుతూ నదీ పరివాహక ప్రాంతాల్లో రివర్ ఫ్రంట్ ఏరియా ఉంటుందని, విదేశాల్లో ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ లుగా అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు..ఏపీలో నదులు సంస్కృతిలో భాగమని, ఈ క్రమంలో పుష్కర్ ఘాట్ అభివృద్ధితో పాటు చారిత్రక, కళా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్నవరం, గండికోట, శ్రీశైలం తదితర ప్రాంతాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.ఇటీవల విదేశాల పర్యటనకు దుర్గేష్ వెళ్లి వచ్చారు.. పవిత్ర బుద్ధ భగవానుని అవశేషాలను వియత్నాం దేశానికి తీసుకెళ్లారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా ఆకర్షించేలా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం, పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న నేలబిడ్డ కందుల దుర్గేష్ ల సారథ్యంలో పర్యాటక రంగం ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుకు ముందుండి సహకారం అందించిన ఎంపీ పురందేశ్వరీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వీరులు పుట్టిన నేల రాజస్థాన్ నుండి కేంద్రమంత్రి షెకావత్ వచ్చారని, అంత పౌరుషం ఉన్న నేల అంతే పౌరుషం ఉన్న ఆంధ్రప్రదేశ్ నేల స్వభావాన్ని అర్థం చేసుకుందని ఉదహరిస్తూ కేంద్ర మంత్రి షెకావత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పాం..ప్రజలు విశ్వసించి ఎన్డీయే కూటమిని గెలిపించారు.. అందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ చిరకాల స్వప్నమైన వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగమని అందరూ గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి అమరావతి రాజధాని నిర్మాణం మొదలుకొని పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్, ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇలా అన్నింటికి ప్రోత్సాహం ఇస్తూ అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ ఆంధ్రరాష్ట్రం కావాలంటే వికసిత్ జిల్లాలు కావాలి..అంటే వికసిత్ రాజమహేంద్రవరం వికసిత్ ఆంధ్రప్రదేశ్ లో భాగమని గుర్తించాలని కోరారు. వికసిత్ రాజమహేంద్రవరంలో భాగంగానే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనతో పాటు పలు ప్రాజెక్టులు ప్రారంభించడం జరుగుతోందని,100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి నిరుపయోగంగా ఉన్న హేవలాక్ వంతెన ప్రాధాన్యతను కేంద్రం గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోందన్నారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా విగ్రహాలు తొలగించకుండా అభివృద్ధిని చేయాలని పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కు సూచించామని వివరించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నేడు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కర్ ఘాట్ ను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరాన్ని చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని అభ్యర్థించారు..ఇప్పటికే ఈ అంశాన్ని తాను పార్లమెంట్ లో లేవనెత్తాను..రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం..ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గౌతమీ లైబ్రరీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్రవరం అభివృద్ధికి కచ్చితంగా తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుతో అధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రాజధాని రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాలకు మరింత శోభ తెస్తామన్నారు. ఉభయగోదావరి జిల్లాల పర్యాటక కేంద్ర ప్రాజెక్టు ఈ అఖండ గోదావరి అని తెలిపారు. రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం శుభ సందర్భంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ బ్రిడ్జి, బ్రిడ్జిలంక, పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ దేవాలయం,గోదావరి కాలువను సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసుకొని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను న్యూఢిల్లీలో కలిశామని, తొలి నుండి కేంద్ర మంత్రి షెకావత్ సంపూర్ణ సహకారం అందించి ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీలకు ధన్యవాదాలు తెలిపారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన షెకావత్ తో డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి రాజమహేంద్రవరానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు, కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 127 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారు నిర్మించిన హేవలాక్ వంతెనను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హేవలాక్ వంతెనను కొత్త రూపు తేవాలన్న ఆలోచనకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా కార్యరూపం దాల్చలేదని, ఈ ప్రయత్నాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం వేస్తున్న తొలి మెట్టు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రాజెక్టులో భాగంగా పిచ్చుకలంకను, గోదావరి పరిసర ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇవ్వాలని, చారిత్రక, సాంస్కృతిక నగరంగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి విజ్ఞప్తి చేశారు. అంతేగాక రాజమహేంద్రవరానికి మరింత ప్రోత్సాహం అందించి మెరుగైన నగరంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ గా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ పురందేశ్వరిని మంత్రి దుర్గేష్ కోరారు. రాజమహేంద్రవరం చరిత్ర, సంస్కృతిని పునరుజ్జీవింపజేయాలని ప్రజలను కోరారు.
తూర్పు గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తూర్పు పర్యాటకానికి సింహ ద్వారంగా ఉన్న రాజమహేంద్రవరం చారిత్రాత్మక వైభవాన్ని, ప్రపంచ వ్యాప్తం చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకురావడం శుభపరిణామమన్నారు. 2014 లో జరిగిన రాష్ట్ర విభజన కంటే, 2019-24 మధ్య 5 ఏళ్ళ పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించే దిశలో కూటమి ప్రభుత్వం టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అందులో భాగంగా ఉత్తరాంద్ర విశాఖ అందాల తీరం నుండి, రాయలసీమ లోని గండికోట, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యాటక అందాలను, టెంపుల్ టూరిజాన్ని కలుపుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే పోలవరం ప్రాజెక్ట్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టూరిజాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా, సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల కష్టానికి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తొలిసారి రాజమహేంద్రవరం విచ్చేసిన పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ కు స్వాగతం తెలిపారు. ఏడాది సుపరిపాలన సభతో కూటమి ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలిపామని, అనంతరం కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకుందని, ప్రజల్లో బలమైన విశ్వాసం ఏర్పడిందన్నారు. మరో 15ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కల అయిన అఖండ గోదావరి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు.రూ.22కోట్లతో గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాత్మకమైన అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకుతో పాటు రూ.450 కోట్లకు పైగా విలువైన పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మలరామానాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ,చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వర రావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
