జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
*ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ
*దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు.. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు
*హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి.. గోదావరికి నిత్యహారతి, ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంక, నిడదవోలు..ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త శోభ
*ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం
*2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పనులు పూర్తికి చర్యలు.. తద్వారా 8వేల మందికి పైగా యువతకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధి
*కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.375 కోట్లతో ఏపీ టూరిజం అభివృద్ధి
*శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ధన్యవాదాలు
*మాజీ సీఎం జగన్ ప్రతి పర్యటనలోనూ ఘర్షణలకు తావిచ్చేలా వ్యాఖ్యలు, విధానాలు.. సినిమా డైలాగులు రాజకీయాల్లో వాడటం సరైన విధానం కాదని హెచ్చరిక
*జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు తీర్మానాలు చేయాలి
*మురగన్ భక్తవరగళ్ మానాడు సదస్సులో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు
*రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం:
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న ఉదయం 10 గం.లకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, కేంద్రం ద్వారా రాష్ట్ర పర్యాటకానికి వచ్చిన నిధులు, యోగాంధ్ర-2025 విజయం, తమిళనాడు మురగన్ సదస్సు, తాజా రాజకీయ అంశాలు, సినిమా పాలసీ తదితర అంశాలపై కూలంకషంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతో కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు పట్టుదల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీల సంపూర్ణ సాయంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు సాకారమయిందన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశముందని, తద్వారా 8వేల మందికి పైగా ఉపాధి కలిగి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.
*హేవలాక్ వంతెన పునర్నిర్మాణం
కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి -2024-25 (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్) స్కీమ్ ద్వారా దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ నిధులతో చారిత్రక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర గలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రతిష్టాత్మక హేవలాక్ వంతెన పునర్నిర్మించి చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా 2.7 కి.మీ ల పొడవైన వంతెనపై 54 స్పాన్‌లు ఉన్నాయని, వీటిలో 25 స్పాన్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. హేవలాక్ వంతెన ప్రాంతంలో ఒక్కో స్పాన్ క్రింద ఒక్కో థీమ్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. అందులో రాజమహేంద్రవరం చరిత్ర, ఏపీ చరిత్రను తెలిపే స్పాన్ ఉంటుందన్నారు. జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్ లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. ఈ థీమాటిక్ జోన్‌లకు ఆనుకుని సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను అందించేలా 10 బఫర్ స్పేస్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఉపయోగంలో లేని బ్రిడ్జిని కూల్చేదామని రైల్వే శాఖ భావించినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని నేపథ్యాన్ని వివరించారు. ప్రజల ఉపయోగార్థం, సందర్శనార్థం చేపట్టే ప్రాజెక్టులో భాగంగా బ్రిడ్జి భద్రతా ప్రమాణాలపై దృష్టి కేంద్రీకరించామన్నారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాం ప్రకారం పర్యావరణ కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.
*పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంక
18వ స్పాన్ అనంతరం 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రిడ్జిలంకలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేగాక గోదావరి నది వెంట ఘాట్ లకు వెళ్లేలా బ్రిడ్జి లంక వద్ద బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గేమింగ్ జోన్ ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కల్పిస్తామన్నారు.
*అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి..గోదావరికి నిత్యహారతి
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ వంతెన పక్కనే ఉన్న పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు. అధ్యాత్మిక గమ్యస్థానంగా పుష్కర్ ఘాట్ ను తీర్చిదిద్దుతామన్నారు. హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ రెండింటిని అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. పుష్కర్ ఘాట్ ను గోదావరి హారతికి, పవిత్ర స్నానాలకు ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం స్నానాలు చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నదన్నారు.. అక్కడ ఎలాంటి అధ్యాత్మిక వాతావరణం లేదని, అఖండ గోదావరి ప్రాజెక్టు అమలు చేసిన అనంతరం ప్రపంచ స్థాయి వసతులు కల్పించి అధ్యాత్మిక వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఏడాది పొడవునా యాత్రికులు పుష్కర్ ఘాట్ లో స్నానమాచరించేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
*టూరిజం స్పాట్ గా, ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీ
భారతదేశపు అతి పెద్ద నర్సరీలో ఒకటైన కడియం నర్సరీ, గోదావరి కాలువ వంటి చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నామమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి పొంది ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోన్న కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చి ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా వృద్ధి చేస్తామన్నారు. కడియపులంక, పొట్టిలంక మరియు చుట్టుపక్కల నర్సరీల చుట్టూ పర్యావరణ అనుకూల పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నాం.
*పర్యాటక కేంద్రంగా నిడదవోలు..ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయానికి కొత్త శోభ
విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి, అద్భుతమైన ప్రాకారాలు, ఆకట్టుకునే ముఖ ద్వారం, ఎత్తైన రాజగోపురంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో అలరారుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తమ్మ దేవాలయాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అదనపు యాత్రికుల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నామని, ఆలయ రాజగోపురం ఆధునికీకరించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నిడదవోలు శాసనసభ్యుడిగా త్రిశక్తి స్వరూపిణి కోట సత్తెమ్మ తల్లి ఆలయాన్ని డీపీఆర్ లో అంతర్భాగం చేసి ఆలయంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు శ్రీకారం చుట్టానన్నారు.
*సమిశ్రగూడెం గోదావరి కాలువ చెంతన గోదావరి హారతి ఘాట్ ఏర్పాటు
భారతదేశంలో రెండవ పొడవైన నదిగా పేరుగాంచడంతో పాటు రాజమహేంద్రవరానికి జీవనాడి అయిన గోదావరి కాలువను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు. గోదావరి హారతి ఘాట్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. గోదావరి చుట్టు ప్రక్కల పర్యాటకులు ఆహ్లాదంగా సేదతీరేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా, కాలువలో పడవపై షికారు చేసే విధంగా తీర్చిదిద్దనునున్నామన్నారు.
*కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.375 కోట్లతో ఏపీ టూరిజం అభివృద్ధి
శాస్కి (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్) స్కీమ్ ద్వారా రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి, రూ.75.91 కోట్లతో గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. సీబీడీవో (చార్టర్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్) స్కీమ్ ద్వారా అన్నవరం, నాగార్జున సాగర్ లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇవే గాక ప్రసాద్ స్కీమ్, స్వదేశీ దర్శన్ -2 నిధుల ద్వారా రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేగాక అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అమరావతి, నాగార్జున కొండ, తొట్ల కొండ, బావి కొండ, ఆదుర్రు, ఘంటసాల తదితర బౌద్దమత వ్యాప్తి చెందిన ప్రాంతాలను బుద్ధిస్ట్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల రెండు మూడు పర్యాయాలు న్యూఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసినప్పుడు సంబంధిత డీపీఆర్ లు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ అంశాన్ని ప్రకటించినట్లు గుర్తుచేశారు.
*ఉపాధి కల్పన, సంపద సృష్టి టూరిజం అభివృద్ధి ప్రధానం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిసారి టూరిజం అభివృద్ది ద్వారా ఉపాధి కల్పన, సంపద సృష్టి జరుగుతాయని అంటారు..ఆ మాటలు అక్షర సత్యాలు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశముందని, హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు అవుతాయన్నారు. తద్వారా 8వేల మందికి పైగా యువతకు ఉపాధి కలిగి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఎంట్రెన్స్ ఫీజు, పర్యాటక కార్యకలాపాలు, రిటైల్ స్టోర్స్ తదితర వాటివల్ల ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు తెలిపారు.
*2027 గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి పనుల పూర్తికి చర్యలు
గోదావరి పుష్కరాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక ప్రాంతాలకు రోడ్లు, రవాణా తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు అద్భుత సుందర పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతాయన్నారు. రాష్ట్రంలో ఒబెరాయ్ గ్రూప్ 5 ప్రాంతాల్లో తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి దుర్గేష్ వివరించారు. పిచ్చుకలంకలో రిసార్ట్ లు ఏర్పాటు చేసేందుకు వారి బోర్డు తీర్మానించిందన్నారు. త్వరలో పిచ్చుకలంక పర్యటనకు ఒబెరాయ్ గ్రూప్ వస్తుందన్నారు. ఆ పర్యటన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నారు.
*ఏపీని దుష్టుల నుండి రక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది
తమిళనాడులో జరిగిన మురగన్ భక్తవరగళ్ మానాడు లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అద్భుతంగా ప్రసంగించారని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంకు విశేషమైన ఆదరణ వచ్చిందన్నారు. మురగన్ ఏ విధంగా అయితే దేవతలను రక్షించారో మన రాష్ట్రాన్ని దుష్టుల నుండి రక్షించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మురగన్ అంటే కుమారస్వామి అని ఆయన దేవతలందరికీ సర్వసైన్యాధ్యక్షులని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఆయన్ను పూజించడం ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుందని, మురగన్ వల్ల దేవతలందరూ కాపాడబడ్డారు అని మురగన్ ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని అన్నారు. మురగన్ ఆశీస్సులతో రాష్ట్రాన్ని దుష్టుల నుండి కాపాడాలని, అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో తమిళనాడు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
*సినిమారంగంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా ఫిల్మ్ పాలసీ
రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని భావించి సీఎం, డిప్యూటీ సీఎంలు అందరికీ ఉపయోగడపడేలా సమగ్రవిధానంతో కూడిన ఫిల్మ్ పాలసీ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సినిమారంగానికి చెందిన అందరితో చర్చించి పాలసీపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి సినిమా విడుదల సమయంలో తరుచూ కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయని వాటన్నింటికి చెక్ పెడతామన్నారు. ఏ కొందరికో ఉపయోగడేలా కాకుండా అందరికీ ఉపయోగపడేలా సమగ్ర విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
*యోగాను కొనసాగిద్దాం
అంతర్జాతీయ యోగా డేని ఏపీలో నిర్వహించాలన్న ప్రధాని పిలుపు మేరకు సీఎం చంద్రబాబునాయుడు విశాఖలో నిర్వహించడం,అది పెద్ద ఎత్తున విజయవంతం కావడం ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలు ఇలా అందరి సమిష్టి కృషితో కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. సీఎం పిలుపుతో నెల రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో యోగాకు స్థానం కల్పించామన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని సూచించారు. యోగాను జీవితాంతం కొనసాగించాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు ఉద్దేశమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదంతో ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను ఒక కార్యక్రమంగా చేయాలని, పాఠ్యాంశంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మానసిక, శారీరక ధృడత్వాన్ని ఇచ్చేలా యోగాను ప్రత్యేక కార్యక్రమంగా తీర్చిదిద్ది పట్టాలెక్కించేందుకు సీఎం ప్రణాళికలు చేస్తున్నారని వివరించారు.
*సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా మాజీ సీఎం జగన్ మాట్లాడిన మాటలు దేనికి సంకేతం?
బాధ్యత కలిగిన నాయకులు రపా రపా … అంటూ సినిమా డైలాగులు బహిరంగంగా వాడి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని మంత్రి దుర్గేష్ ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో అలాంటి డైలాగులు సహేతుకమైనవి కాదని, తద్వారా అశాంతి హెచ్చుమీరుతుందని మాజీ సీఎం జగన్ బాధ్యతాయుతంగా చెప్పాల్సింది పోయి ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. ఆయన ఇలాంటి డైలాగులు మంచివే అని అనడం ద్వారా ఆయన మాట్లాడే మాటలకి హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. అలాంటి వ్యక్తి మాటలకి విలువ ఇవ్వాలా అని ప్రశ్నించారు. సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అన్నారు. అలాంటి వ్యాఖ్యలను మేం ఆమోదించాలా అన్నారు. అలాంటి వ్యాఖ్యలను ప్రశ్నిస్తే వక్రభాష్యాలు పలుకుతున్నారని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. ఆయన ప్రతి పర్యటనలోనూ ఘర్షణలకు తావిచ్చేలా వ్యాఖ్యలు, విధానాలు ఉంటున్నాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యుద్ధవాతావరణం తేవాలని కొందరు భావిస్తుంటే.. అలాంటి వాళ్ల మీద ఉక్కు పాదం మోపి అణగొట్టేందుకు, శాంతియుత వాతావరణం సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక విధానంలో వెళ్తుందన్నారు. సినిమా డైలాగులు సినిమాకే పరిమితం చేయాలని సూచించారు. నిజజీవితంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్న వ్యక్తులను, బయట ప్రపంచంలో విద్వేషాగ్నులు రగులుస్తున్న వ్యక్తలను రాజకీయాలో ఉండకూడదని, వారిని రాజకీయాల నుండి బహిష్కరించేలా రాష్ట్ర ప్రజలందరూ తీర్మానం చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
*ప్రజలకు అందుబాటులో ఉండేలా రుషికొండ ప్యాలెస్ పై త్వరలో నిర్ణయం
గతంలో ఉన్న పర్యాటక రిసార్ట్ ల స్థానంలో గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ నిర్మాణం చేపట్టడం వల్ల రాష్ట్ర పర్యాటక శాఖకు వచ్చే ఆదాయం కోల్పోయామన్నారు. ప్రస్తుతం ప్యాలెస్ మెయింటెనెన్స్ ను విపరీత ఖర్చవుతోందన్నారు. దాన్ని అప్పు చేసి కట్టాల్సి పరిస్థితి దాపురించిందన్నారు. దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా సీఎం ఆలోచిస్తున్నారని త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.